ఏకశిలానగరి ఒంటిమిట్ట కోదండరాముడి కోవెలలో వచ్చే నెలలో శ్రీరామనవమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 21 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 20వ తేదీ అంకురార్పణ, 21న ధ్వజారోహణం, 26వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, 27వ తేదీ రథోత్సవం, 30వ తేదీ పుష్పయాగం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులకు కావాల్సిన వసతుల కల్పనపై సివిల్ విభాగం సాంకేతిక నిపుణులు ప్రత్యేక దృష్టి సారించారు. రూ.115 లక్షలు ఖర్చు చేసేందుకు ఉన్నతస్థాయిలో ఆమోదం తెలిపారు.
కల్యాణ వేదిక, రక్షణగోడకు రంగులు, పిచ్చిమొక్కల తొలగింపు, రెండు వరుసల రహదారి మరమ్మతులకు రూ.4 లక్షలు, రామయ్య క్షేత్రం పరిసర ప్రాంతాలు, రాములోరి పెళ్లి జరిగే వేదిక వద్ద నేల చదును పనులు, నీళ్లు జల్లడానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేకతను చాటేవిధంగా ఫ్లెక్సీలతో స్వాగతతోరణాలు, గోడపత్రాల ఏర్పాటుకు రూ.21 లక్షలిచ్చేందుకు అంగీకారం తెలిపారు. దాశరథి ఆలయం లోపల ప్రాకారం చుట్టూ చలువ పందిళ్ల ఏర్పాటుకు రూ.13.50 లక్షలు, బయట వైపున పందిళ్ల ఏర్పాటుకు రూ.10.50 లక్షలు, జానకిరాముల పరిణయం ఘట్టం జరిగే రోజు భక్తులు కూర్చోవడానికి అనువుగా వేసే పందిళ్లకు రూ.22 లక్షలు ఖర్చు చేయనున్నారు.
ఇతర ప్రదేశాల్లో నీడ వసతి కల్పించేందుకు రూ.17.50 లక్షలు, రథోత్సవం కార్యక్రమానికి రూ.4 లక్షలు, తాగునీటి పొట్లాల కొనుగోలుకు రూ.6 లక్షలు, సంచార మరుగుదొడ్లకు అద్దె చెల్లింపులకు రూ.6.50 లక్షలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే గుత్తపత్రాలను ఆహ్వానించారు. నిబంధనల ప్రకారం పనులను దక్కించుకున్న గుత్తేదారులతో ఒప్పందం చేసుకుని ఉత్సవ ఏర్పాట్లు చేస్తామని సీనియర్ అధికారి తెలిపారు.
ఇదీ చదవండి: కృష్ణా జలాల వివాదం.. నేటి నుంచి బ్రిజేష్ ట్రైబ్యునల్ విచారణ