Viveka Murder Case Updates: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వై.ఎస్. భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల జ్యుడిషియల్ రిమాండ్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ హైదరాబాద్ నాంపల్లి కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ పొడిగిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి ఈ నెల 30వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
అంతకుముందు జూన్ రెండో తేదీన వివేకా హత్య కేసుపై నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అప్పటి విచారణకు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్‌తోపాటు ఉమాశంకర్ రెడ్డిలు హాజరయ్యారు. విచారణ చేపట్టిన అనంతరం ఈ కేసు విచారణను నేటికి వాయిదా వేశారు. నిన్న దీనిపై విచారణ జరిపి నిందితుల రిమాండ్‌ను ఈ నెల 30వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిమాండ్ పొడిగించడంతో నిందితులను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.
భాస్కర్‌రెడ్డికి బెయిల్ నిరాకరణ: మరో వైపు వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు జూన్ 9న నిరాకరించింది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ.. సీబీఐ ఈ నెల 5న సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో పలు అంశాలు ప్రస్తావించింది. వైఎస్ వివేకా హత్య కేసులో కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ 8వ నిందితుడిగా పేర్కొంది. వాదనలు విన్న సీబీఐ కోర్టు భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది.
Viveka case: వివేకా హత్య కేసు.. భాస్కర్‌రెడ్డి రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు
సీబీఐకి సహకరించేందుకు సునీతకు అనుమతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సహకరించేందుకు వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పెట్టుకున్న అభ్యర్థనకు శుక్రవారం సీబీఐ కోర్టు అనుమతించింది. విచారణలో సీబీఐకి సహకరించేందుకు అనుమతించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సీహెచ్.రమేశ్ బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివేకా హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో విచారణ ప్రక్రియలో తనకూ అనుమతి ఇవ్వాలన్న ఆమె అభ్యర్ధనకు అనుమతించారు. విచారణ సందర్భంగా సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆమెగానీ, ఆమె ఏర్పాటు చేసిన న్యాయవాదిగానీ సహకరించడానికి అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేఖ మురకాస్ కేసులో ప్రాసిక్యూషన్కు సహకరించే విషయంలో సుప్రీంకోర్టు పేర్కొన్న మార్గదర్శకాలకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు.