కడప కేంద్ర కారాగారం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా వరుణారెడ్డి ఈనెల 3న బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చిన తర్వాత కడప కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ సమయంలో వరుణారెడ్డి జైలు ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ గా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవలే అవార్డు సొంతం..
కర్నూలు జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి పదోన్నతిపై కడపకు వచ్చారు. గతేడాది ఆగస్టులో కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా ఉన్న రవికిరణ్ పదోన్నతిపై డీఐజీ అయ్యారు. అప్పటి నుంచి కడప జైల్లోనే డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉన్న గన్యా నాయక్ ఇన్ ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇపుడు ఆయన స్థానంలో కొత్తగా వరుణారెడ్డి వచ్చారు. ఈయనకు ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసు అవార్డును కూడా కేంద్రం అందజేసింది.
మొద్దు శీను హత్య సమయంలో ఇన్ ఛార్జ్‌గా..
పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దు శీను అనంతపురం జైలులో హత్యకు గురైన సమయంలో ఇంచార్జ్‌గా వరుణారెడ్డి ఉన్నారు. పరిటాల కేసు చివరి దశకు చేరుకున్న సమయంలో తాను అప్రూవర్‌గా మారుతున్నానని మొద్దు శీను అంగీకరించాడు. అలా ప్రకటించిన కొద్దిరోజుల్లోనే.. 2008 నవంబరు 9న మొద్దు శీను దారుణహత్యకు గురయ్యాడు. ఆరోజు జైలు ఇన్‌ఛార్జిగా ఉన్న వరుణారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వరుణారెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మొద్దు శీను హత్యకు కొద్దిరోజుల ముందు ఓంప్రకాశ్ సరస్వతి బ్యారెక్-2లో ఉండేవాడు. అతని వద్ద డబ్బు ఉందన్న అనుమానంతో... వరుణారెడ్డి అతని బ్యారెక్ తనిఖీ చేసినా డబ్బు దొరకలేదు. తర్వాత ఓంప్రకాష్ ను మొద్దు శీను ఉండే యమునా బ్యారెక్ లోకి తరలించారు. దీనిపై మొద్దు శీను అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత సిమెంటుతో తయారు చేసిన డంబెల్‌తో మొద్దు శీనును ఓంప్రకాశ్ హత్య చేశాడు.
నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు..
జైలు గదిలోకి డంబెల్ రావడం, తదితర వ్యవహారాల్లో జైలు అధికారుల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. మొద్దు శీను గదిలోకి ఓం ప్రకాశ్ ను కావాలనే వరుణారెడ్డి పంపించారని పరిటాల హత్య కేసు నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అప్పట్లో అనంతపురం జిల్లా న్యాయమూర్తికి లేఖ రాశారు. మొద్దు శీను హత్య జరిగిన రోజున సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడంతో.. వరుణారెడ్డి ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. ఇపుడు అదే వరుణారెడ్డి కడప జైలుకు రావడం.. ఈ జైల్లో వివేకా కేసు నిందితులు ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ నియామకం సరైంది కాదు: రఘురామ
కడప కేంద్ర కారాగారం ఇన్ ఛార్జి సూపరింటెండెంట్‌గా.. వరుణారెడ్డి బాధ్యతలు చేపట్టడంపై.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. పరిటాల రవి హత్యకేసు నిందితుడు మొద్దు శీను ఘటన జరిగిన సమయంలో.. అనంతపురం జైలు ఇంఛార్జ్ గా వరుణారెడ్డే ఉన్నారని గుర్తు చేశారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో.. కీలక నిందితులున్న కడప జైలుకు ఇన్ ఛార్జి సూపరింటెండెంట్ గా నియమించడం సరైన నిర్ణయం కాదని.. అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: సాధారణ తనిఖీల్లో అసలు విషయం బయటకు.. పోలీసుల షాక్!