Vontimitta Brahmotsavam Arrangements: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని.. టీటీడీ ఈవో ఆధ్వర్యంలో కడప జిల్లా అధికారులతోనూ, టీటీడీ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఆలయ ప్రాంగణం, కల్యాణ వేదికల వద్ద ఉత్సవ ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఈనెల 30వ తేదీ నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో 11 రోజులు పాటు ఒంటిమిట్టలో టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కృషి చేయాలని కోరారు.
హాజరుకానున్న సీఎం జగన్: ఏప్రిల్ ఐదవ తేదీన జరిగే కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తుండటంతో.. పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాముల వారి కల్యాణోత్సవాన్ని చూసేందుకు కల్యాణ వేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒక ఇంఛార్జిని నియమించనున్నారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు.. ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా.. అధికారులు, పోలీసులు తగిన జాగ్రత్తలతో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
వచ్చే భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆహారం, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా సక్రమంగా అందేటట్లు చూడాలని సూచించడం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీ జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సేవల వివరాలు : మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 9 వరకు కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి, ఏప్రిల్ 3వ తేదీన హనుమత్సేవం, 4వ తేదీన గరుడ సేవ, 5వ తేదీన కల్యాణోత్సవం, 6వ తేదీన రథోత్సవము, 7వ తేదీన అశ్వవాహనము, 8వ తేదీన చక్రస్నానం, 9వ తేదీన శ్రీపుష్పయాగం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాడుచేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.
ఆలయ ప్రాముఖ్యత: ఒంటిమిట్టలో 11వ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలానగరి.. సీతారామలక్ష్మణుల మూలవిరాట్లు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి. శ్రీరాముడికి ఆంజనేయస్వామి పరిచయం కాకముందే ఈ ఆలయంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై నిర్మించారన్నది చరిత్ర చెప్తున్న కథనం. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా కనిపించదు.
"ఏప్రిల్ 5వ తేదీన కల్యాణం జరుగుతుంది. ఈ కల్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. అదే విధంగా గతంలో జరిగిన కల్యాణాలను దృష్టిలో పెట్టుకొని.. భక్తులందరికీ మంచి సౌకర్యాలతో కల్యాణం చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం". - వీరబ్రహ్మం, టీటీడీ డిప్యూటీ జేఈవో
ఇవీ చదవండి: