క్రీడా పోటీల్లో తైక్వాండోకు ప్రత్యేక స్థానం ఉంది. ఒలింపిక్స్‌లో భాగమైన ఈ క్రీడను నేర్చుకునేందుకు చిన్నారులు ఆసక్తి చూపిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో తైక్వాండోలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు.
తైక్వాండోలో శిక్షణతో పాటు మెళకువలు చాలా అవసరం. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా.... చిన్నారులు తైక్వాండోలో శిక్షణ తీసుకుంటున్నారు. రన్నింగ్, జంపింగ్, పంచ్, కిక్ వంటి అంశాల్లో బాలురతో సమానంగా బాలికలూ రాణిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలు ఇంకా తెరచుకోలేదు. అయినా... తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన ఆటలు, అభిరుచులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇలాంటి యుద్ధవిద్య నేర్చుకుంటే పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
తైక్వాండో శిక్షణ తరగతులకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురుదాడి, లైంగిక వేధింపుల నుంచి ఆత్మరక్షణ కోసం కవచంలా ఈ యుద్ధ విద్య ఉపయోగపడుతుందని తల్లిదండ్రులతో పాటు శిక్షకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : పంటల బీమా.. రైతుల ఖాతాలో రూ.1252 కోట్ల జమ