Nara Lokesh's meet with Balija (Kapu) social groups : రాయలసీమలో బలిజలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడానికి తెలుగు దేశం ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం భూమయ్యగారి పల్లి క్యాంప్ సైట్ వద్ద బలిజ(కాపు) సామాజిక వర్గాలతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారని.. రాయలసీమలో బలిజల్ని జగన్ ప్రభుత్వం పట్టించు కోలేదని అన్నారు. తన పిల్లలు విదేశాల్లో చదివితే చాలు.. పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదు అనే ఆలోచనలో జగన్ విదేశీ విద్య పథకం రద్దు చేశారని విమర్శించారు.
గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామన్న లోకేశ్... జగన్ కక్షతో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారనీ పేర్కొన్నారు. బలిజలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తాం. వారిని గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని లోకేశ్ అన్నారు. జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించి తల్లిదండ్రులు, విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. సీఎం సొంత జిల్లా అంటే ఎలా అభివృద్ధి చెందాలి? కేవలం జయంతి, వర్ధంతికి తప్ప కడప జగన్‌కి గుర్తు రావడం లేదని విమర్శించారు.
2024 ఎన్నికల్లో అదే 10 సీట్లు టీడీపీకి ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.. చెయ్యకపోతే కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని లోకేశ్ వ్యాఖ్యానించారు. టీడీపీ రాజంపేట పార్లమెంటు నుంచి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే, జగన్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారని విమర్శించారు. తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టాడని అన్నారు. బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాం అని లోకేశ్ గుర్తు చేశారు.
తాడేపల్లిలో క్రీడా ప్రాంగణం.. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నారా లోకేశ్ మరో కానుక అందించారు. తాడేపల్లిలోని యువత కోసం జాతీయ రహదారి పక్కన ప్రత్యేక క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో క్రికెట్, వాలీబాల్, షటిల్, టెన్నిస్ ఆడుకునే విధంగా వసతులు సమకూర్చారు. ఈ మైదానాన్ని తానా మాజీ అధ్యక్షుడు కమిటీ జయరాం, వేమూరి రవికుమార్ ప్రారంభించారు. వీరిద్దరూ కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అలరించారు. నారా లోకేశ్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి రావడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం చెప్పారు. నారా లోకేశ్‌ను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన టీడీపీ నేతలు పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెంచుకోవచ్చు అని అన్నారు.