కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణహత్యకు గురయ్యారు. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేసి.. సుబ్బయ్య తల ఛిద్రం చేశారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన సుబ్బయ్య రాజకీయంగా విమర్శలు చేస్తూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అనంతరం ప్రత్యర్థి పార్టీ శ్రేణులు ప్రతి విమర్శలు చేశారు. నాలుగైదు రోజుల నుంచి ఈ వివాదం జరుగుతోంది. మంగళవారం ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బయ్య.. వైకాపా శ్రేణులపై అరిచాడు. అనంతరం దుండగులు సుబ్బయ్యను నరికి హత్య చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ కోణంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్షల కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఆ ఇద్దరే హత్య చేయించారు..
తన భర్త చావుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బావమరిది బంగారు రెడ్డిలే కారణమని నందం సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు. వాల్లిద్దరే తన భర్తను చంపించారని అపరాజిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుండా రవి మరో నలుగురు వ్యక్తులు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి తమ ఇంటి చుట్టూ తిరిగారని తెలిపారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చెయ్యలని డిమాండ్ చేశారు.
నలుగురు వ్యక్తులు లొంగుబాటు..
నందం సుబ్బయ్య భార్య అపరాజిత ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన అనంతరం.. చాపాడు పోలీస్‌స్టేషన్‌లో నలుగురు నిందితులులొంగిపోయరు.
కక్షతో సబ్బయ్యను హతమార్చారు..
ప్రొద్దుటూరులో తెదేపా నాయకుడు సుబ్బయ్య హత్యను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన సుబ్బయ్య హత్య కిరాతక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌లో వైకాపా ఎమ్మెల్యే, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేశాడన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన తెదేపా నాయకుడిని హత్య చేయించడం సీఎంకు సిగ్గు చేటన్నారు. గత 19నెలల్లో రాష్ట్రంలో అనేకమంది తెదేపా నాయకులు, కార్యకర్తలను బలిగొన్నారన్నారు. హంతకులను కఠినంగా శిక్షించి సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
సీఎం సొంత జిల్లాలో తెదేపా నేత హత్య.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందని, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరోపించారు. సుబ్బయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.19 నెలల జగన్ పాలనలో.. రాష్ట్రంలో హింస జరగని రోజంటూ లేదని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హత్యా రాజకీయాలకు తెర తీశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నేతల నిరసన
సుబ్బయ్యను హత్యచేసిన నిందితులను అరెస్టు చేయాలని కడపలో తెదేపా నేతలు డిమాండ్ చేశారు. వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: కోపంతో రగిలిన కోడలు... అత్త ముక్కు కొరికేసింది..