బద్వేల్ ఉపఎన్నికకు తెదేపా అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్‌ను అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. జమ్మలమడుగు ఇంఛార్జిగా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ ను దాదాపుగా ఖరారు చేశారు. ఇంఛార్జిల నియామకం జరగని పెండింగ్ నియోజకవర్గాలపై తెలుగుదేశం అధినేత పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 3రోజుల పాటు వరుస సమీక్షలు నిర్వహించారు. సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్య మృతితో త్వరలో ఉపఎన్నిక జరగనున్న బద్వేల్ స్థానానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు షెడ్యూల్ ప్రకటన రాకముందే అభ్యర్థిని ఖరారు చేశారు. 2019లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్ నే తిరిగి ఉపఎన్నికలలోనూ బరిలో దింపాలని నిర్ణయించారు. బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మతోనూ ఈ విషయమై ఫోన్లో చంద్రబాబు సంప్రదించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కడప జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్షించారు. ఉపఎన్నికకు ఇప్పటి నుంచే పనిచేసుకోవాలని రాజశేఖర్ కు సూచించారు.
జమ్మలమడుగు ఇంఛార్జ్ గా మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ ను దాదాపుగా ఖరారు చేశారు. తండ్రి నారాయణరెడ్డితో పాటు కుటుంబ సభ్యుడైన మరో ఎమ్మెల్సీ శివనాథరెడ్డితో కలిసి భూపేష్ రెడ్డి.. చంద్రబాబును కలిశారు. జమ్మలమడుగులో తెదేపాకు తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని భూపేష్ రెడ్డికి చంద్రబాబు సూచించారు. బాబాయి ఆదినారాయణ రెడ్డి భాజపాలోకి వెళ్లినా తాము, కుటుంబ సభ్యులంతా తెదేపాను అంటిపెట్టుకునే ఉన్నామని ఈ సందర్భంగా నారాయణరెడ్డి, శివనాథరెడ్డి, భూపేష్ లు చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. నాలుగైదు రోజుల్లో తమ వర్గానికి చెందిన ముఖ్యనేతలందిరినీ అధినేత వద్దకు తీసుకొస్తానని భూపేష్ రెడ్డి తెలిపారు.
ఇంఛార్జ్‌ల నియామకం జరగని పెండింగ్ నియోజకవర్గాలపై తెలుగుదేశం అధినేత అధినేత పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 3రోజుల పాటు వరుస సమీక్షలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నాయకత్వంపై నియోజవకర్గ నేతలతో గురువారం, శుక్రవారాల్లో రెండు రోజులపాటు సుదీర్ఘ కసరత్తు చేశారు. ప్రస్తుత ఇంఛార్జ్ గా ఉన్న అనీషా రెడ్డి స్థానంలో బాబు రెడ్డి లేదా వేరొక సీనియర్ నేతని నియమించాలనే దిశగా చర్చ సాగినట్లు సమాచారం. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నేతలు చంద్రబాబుతో భేటీ అయి నియోజకవర్గ ఇంఛార్జ్‌ని త్వరగా ఖరారు చేయాలని కోరారు. కోడెల స్వగ్రామమైన కండ్లగుంట లో ఏర్పాటు చేసిన కోడెల విగ్రహ ఆవిష్కరణకు అచ్చెన్నాయుడును ఆహ్వానించేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన నేతలు చంద్రబాబుని కలిశారు.
ప్రకాశంజిల్లా నేతలు చంద్రబాబుతో సమావేశమై జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించారు. బుధవారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కుమార్తెను అక్కడ ఇంఛార్జ్‌గా నియమించాలనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పామర్రులో నాయకత్వ మార్పు పై చర్చ జరుగుతుండడంతో ఉప్పులేటి కల్ప దంపతులు చంద్రబాబుతో బుధవారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంశంపై అధినేతతో గురువారం భేటీ అయ్యారు.
రెవెన్యూ డివిజన్‌గా బద్వేలు
కడప జిల్లా బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించనున్నారు. రానున్న మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేయనున్నారు. ఇటీవల సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా బద్వేలును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి