ఫాతిమా వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన కొవిడ్ ఆసుపత్రి
కడప జిల్లాలో ఫాతిమా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆసుపత్రి కీలకంగా ఉంది. ఇక్కడ మొత్తం 450 పడకలు అందుబాటులో ఉండగా... శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి 372 మంది రోగులు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 20 మంది రోగులకు ఒక వైద్యుడు, ప్రతి 10 మందికి ఒక నర్సు ఉండాలి. వారికి మూడు షిఫ్టుల్లో విధులు కేటాయిస్తారు. కొవిడ్ నిబంధనల ప్రకారం వారం విడిచి వారం క్వారంటైన్‌లో ఉండాలి. ఇక్కడ చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యను బట్టి చూస్తే కనీసం వైద్యులు 90, నర్సులు 180, పురుష, మహిళా నర్సింగ్ ఆర్డర్లీలు(ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వో) కలిపి 90 మంది అవసరమవుతారు. కానీ వైద్యులు 20, నర్సులు 60, ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలు 50 మంది మాత్రమే ఉన్నారు. ఇదొక్క చోటే కాదు.. మిగతా మూడు ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. జిల్లాలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు అందుబాటులో ఉండట్లేదు. ఈ కారణంగా ఉన్న అరకొర వైద్యులపైనే రెట్టింపు పనిభారం పడడంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందట్లేదు.
తాత్కాలిక ప్రాతిపదికన నియామకం
గతేడాది వైరస్ మొదటి దశ వ్యాప్తి సమయంలో కొవిడ్ ఆసుపత్రుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఆరునెలలు పనిచేసేందుకు కొంతమందిని నియమించారు. జిల్లాలో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 649 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించి కొవిడ్ విధులు కేటాయించారు. వివిధ కారణాలతో కొంతమంది మధ్యలో, గడువు ముగిశాక మరికొంతమంది స్వచ్ఛందంగా వైదొలిగారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తి కారణంగా గతంలో ప్రత్యేకంగా నియమించిన వారితోపాటు అదనంగా 20 శాతం మందిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో ఖాళీలను భర్తీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం 711 మంది వైద్య సిబ్బంది కొవిడ్ విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని పోస్టులకు సంబంధించి కొత్తగా ఎవరూ ఆసక్తి చూపకపోగా, గతేడాది పనిచేసిన కొందరు వెళ్లిపోయారు. ఈ కారణంగా ఆయా పోస్టులకు సంబంధించి కొరత ఏర్పడింది. జిల్లాలో గతేడాది 168 మంది స్టాఫ్ నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం జిల్లాలో 201 మంది స్టాఫ్ నర్సులు అవసరం కాగా..148 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
కొరత వాస్తవమే...
జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. దీన్ని అధిగమించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు నియామకాలు జరుపుతున్నాం. కొవిడ్ వైద్యసేవలు అందించేందుకు కొందరు ఆసక్తి చూపట్లేదు. వైద్యుల్లో ధైర్యం కల్పించి మరింత మెరుగైన సేవలు అందించేందుకే కేంద్ర ప్రభుత్వం వైద్యులకు టీకా ఇచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అర్హులైన వారు కొవిడ్ విధులు నిర్వర్తించడానికి ముందుకురావాలని కోరుతున్నా. కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో వైద్యసిబ్బంది కొరత కారణంగా రోగులకు ఇబ్బంది రాకుండా కృషిచేస్తున్నాం. అందుబాటులో ఉన్నవారి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటాం. వారికి ఉన్న క్వారంటైన్ నిబంధనను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. - హరికిరణ్, కలెక్టర్, కడప