తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
విధి నిర్వహణలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన తుపాకితో తానే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్.పన్వర్ భద్రతా విధులు నిర్వహిస్తున్నాడు. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత అతను తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతిపై కాల్చుకున్నాడు. గమినించిన తోటి సిబ్బంది వెంటనే నందలూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పన్వర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రైల్వే అధికారులు మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నందలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.