కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని కాపాడాలంటూ... కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, విద్యార్థి జేఏసీ నాయకులు శనివారం రెవిన్యూ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కలిసి ఎన్నో ఏళ్ల చరిత్ర గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ఒక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే హైకోర్టు ఆ స్థలం కళాశాలకు చెందినదిగా తీర్పు ఇచ్చినా... దాన్ని తుంగలో తొక్కి జీవో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆ స్థలంలో మహిళా డిగ్రీ పీజీ కళాశాల, ఉర్దూ కళాశాల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇది వరకే ఆరు ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిందని... ఇప్పుడు మరో నాలుగు ఎకరాలు ఇవ్వడం దారుణమని ఆవేదన చెందారు. కళాశాల మైదానం చుట్టూ వెంటనే ప్రహరీ నిర్మించి పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. భాజపా, ఇతర ప్రజాసంఘాల నాయకులు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు.
ఇవీ చదవండి: