కడప జిల్లా కమలాపురం పంచాయతీలోని కొత్తపల్లె కాలనీ వాసులు వర్షం వస్తేనే వణికిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చదిపిరాళ్ల చెరువుకు నీళ్లు వెళ్లే కాల్వకు గండిపడింది. దీనివల్ల కొత్తపల్లె కాలనీలోకి నీరు వచ్చి చేరుతోంది. కొన్ని ఇళ్లల్లోకి నీరు చేరగా.... రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిల్వ ఉంది.
మురుగు నీటి పారుదల వ్యవస్థ, రోడ్లు నిర్మించకపోవటం వల్లే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొత్తపల్లె కాలనీవాసులు చెబుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయంతో కంటి మీద కునుకులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వర్షం వస్తేనే నీరు నిలబడిపోతోందని వెల్లడించారు. దీనివల్ల దోమలు, పాముల బెడద ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. కాలనీలోకి నీరు చేరకుండా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.