విద్యార్థుల సమస్యలతో పాటు ప్రాంతీయ అసమానతలపై అలుపెరగని పోరాటం చేస్తున్నామని రాయలసీమ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి శంకర్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలోని గీతాంజలి కళాశాలలో.. ఆ సంఘం జిల్లా ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది జూన్, జూలై నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు.
రాష్ట్ర విభజన సమయంలో సీమ అభివృద్ధికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రవి శంకర్ రెడ్డి కోరారు. ఈ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని, హైకోర్టు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తే ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. తద్వారా ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తితిదేలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని.. వాటిలో రాయలసీమ నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
'వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రీయల్ హబ్'ను పరిశీలించిన కలెక్టర్