RAJOLI RESERVOIR : 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అసలు భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులను వదిలేయగా నేటి ముఖ్యమంత్రి జగన్ హయాంలో కొన్నిచోట్ల భూములు తీసుకుని పరిహారం ఇవ్వకుండా గాలికొదిలేశారు. మరోపక్క రైతులకు తమ భూములు అమ్ముకునే అవకాశం లేకుండా చేశారు. కుందూ వరద, శ్రీశైలం వెనుక జలాల విడుదల సమయాల్లో రోజుకు సుమారు 2 టీఎంసీల ప్రవాహం ఉంటుంది. ఈ ప్రవాహ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచాలన్న ఉద్దేశంతో కుందూ విస్తరణ, ఆధునికీకరణ కోసమని రెండేళ్ల క్రితం ప్రభుత్వం 14 వందల కోట్ల రూపాయల్ని మంజూరు చేసింది. వరద నష్టాన్ని అడ్డుకునేందుకు రాజోలి, జొలదరాశి జలాశయాల నిర్మాణాలను ప్రతిపాదించింది.
రాజోలి జలాశయం కింద వైఎస్సార్ జిల్లాలో 90 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, జమ్మలమడుగు వద్ద ఉక్కు పరిశ్రమ నీటి అవసరాలు, ప్రొద్దుటూరు పట్టణ తాగునీటి అవసరాలు తీర్చాలన్నది లక్ష్యం. జొలదరాశి జలాశయం ద్వారా కోవెలకుంట్లకు తాగునీటిని అందించడంతో పాటు ఎత్తిపోతల పథకాల ద్వారా బనగానపల్లి నియోజకవర్గ తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలన్నది ప్రతిపాదన. రాజోలి కోసం 766 ఎకరాలు, జొలదరాశి కోసం 460 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. రాజోలి ప్రాజెక్టు పరిధిలో ఎకరాకు 12. 50 లక్షలు, జొలదరాశి పరిధిలో 16.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఏడాది గడిచినా పరిహారం చెల్లించలేదు.
సీఎం జగన్‌కు ప్రాజెక్టుల శంకుస్థాపన మీద ఉన్న శ్రద్ధ.. పూర్తి చేయటంలో లేదు: రామకృష్ణ
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం రాజోలి వద్ద కుందూ నదిపై 2.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మించాల్సి ఉంది. దీని అంచనా వ్యయం 13 వందల 35 కోట్ల రూపాయలు. జలాశయ నిర్మాణానికి 350 కోట్లు కాగా మిగిలింది భూ సేకరణకు కేటాయించారు. మొత్తం 7 వేల 700 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదించారు. చాగలమర్రి మండలం గొట్లూరులో 350 ఎకరాలు, రాజోలిలో 416 ఎకరాల సేకరణకు అధికారులు ఇప్పటికే రైతుల నుంచి పాసు పుస్తకాల నకళ్లు తీసుకున్నారు. వీటికి పరిహారం ఇవ్వకపోవటంతో తదుపరి సేకరణ ప్రక్రియను అధికారులు నిలిపేశారు. రాజోలి జలాశయం సామర్థ్యాన్ని 2.95 టీఎంసీల నుంచి 1.25 టీఎంసీలకు తగ్గించేలా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. పరిహారాల మొత్తం, నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కుందూ నదిపై కోవెలకుంట్ల మండలం జొలదరాశి సమీపంలో జలాశయ నిర్మాణానికి 2 వేల 465 ఎకరాల భూమి అవసరమని అధికారులు తేల్చారు. భూ సేకరణకు ప్రభుత్వం 369 కోట్లు కేటాయించింది. ఈ జలాశయాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామన్న జగన్ సర్కారు ముందడుగు వేయలేకపోయింది. గతేడాది జులైలో తొలి విడతలో 338 ఎకరాల పట్టా భూమి, 128 ఎకరాల చుక్కలు, అసైన్డ్ భూములను సేకరించిన అధికారులు .. రైతులకు 72 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భూములిచ్చిన రైతులు వాపోతున్నారు.
మాటపై నిలబడాలన్న రైతులు.. ప్రశ్నలొద్దంటూ ఎమ్మెల్యే వర్గీయుల దాడి