జగనన్న విద్యాకానుక కిట్ల (జేవీకే) పంపిణీకి సంబంధించి కడప జిల్లాకు సామగ్రి చేరుతున్న నేపథ్యంలో వీటి భద్రతకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాయచోటి, సంబేపల్లె, లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, గాలివీడు మండలాలలోని పలు పాఠశాలల సముదాయాలకు నోటు పుస్తకాలు చేరుతున్నాయి. గతేడాది జేవీకే పంపిణీలో సామగ్రి అంతా ఒకేచోటకు చేర్చారు. ప్రస్తుతం మండల వనరుల కేంద్రానికి ఏకరూప దుస్తుల వస్త్రం, పాఠశాలల సముదాయాలకు బూట్లు, సాక్సులు, బ్యాగులు, నోటుపుస్తకాలు చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ యా పాఠశాల సముదాయాలు, మండల వనరుల కేంద్రాలకు తిరగకుండా ఆవరణలోనే కిట్లుంటే పంపిణీ సులభమవుతుందని ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పాఠశాల సముదాయాల్లో ప్రధానోపాధ్యాయులు సామగ్రిని భద్రపరిచే అంశంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల సమయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా విధులు నిర్వర్తించే విషయంపై కూడా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. సామగ్రిని పాఠశాలల పునఃప్రారంభం సమయంలో పంపిణీ చేయాలని చెబుతున్నారు.
ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులకు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మాత్రం పాఠశాలల పునఃప్రారంభ సమయానికి స్కూల్‌కాంప్లెక్స్‌లకు జేవీకే చేర్చాలన్న దృఢనిశ్చయంతో చర్యలకు ఉపక్రమిస్తోంది. తమ సంఘం నిర్ణయం మేరకు ప్రధానోపాధ్యాయులు నోటుపుస్తకాలు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. పలుచోట్ల ప్రధానోపాధ్యాయులు సామగ్రిని తీసుకునేందుకు వివిధ కారణాలు చూపుతూ ముందుకురాకపోవడంతో ఆ భారం సీఆర్పీలపై పడుతోంది. జిల్లాలో 271 పాఠశాల సముదాయాలకు వస్తువుల సరఫరా జరగాల్సి ఉంది.
వాయిదా వేయాలి
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని ప్రస్తుతానికి వాయిదా వేయాలి. పాఠశాల సముదాయాల్లో ఎక్కడా అటెండర్స్, వాచ్‌మెన్లు లేనందున వాటికి భద్రత కల్పించడం ప్రధానోపాధ్యాయులకు సాధ్యం కాదు. అనేక పాఠశాలలు ఊరికి దూరంగా ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఈ విషయమై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులకు విజ్ఞప్తులు చేశాం. - జీవీ నారాయణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధానోపాధ్యాయుల సంఘం
ఉత్తర్వులు అమలు చేస్తున్నాం
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జగనన్న విద్యాకానుక కిట్లలో భాగంగా జిల్లాకు చేరుతున్న నోటుపుస్తకాలను ఆయా పాఠశాలల సముదాయాలకు చేరుస్తున్నాం. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కిట్లను చేరవేస్తున్నాం. నిత్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు నోటుపుస్తకాలు తీసుకోవడంపై తమ సంఘం నిర్ణయాన్ని, ఇబ్బందులను చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నాం. - డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, అదనపు పథక సమన్వయకర్త, జిల్లా సమగ్రశిక్ష
ఇదీ చదవండి:
రష్యా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు