ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 14 మంది మృతి చెందటం కలకలం రేపింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా..కురిచేడుతో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించటంతో..మద్యం ప్రియులకు మందు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో చౌకగా లభ్యమయ్యే శానిటైజర్‌ను మందుబాబులు తాగుతున్నారు. సుమారు 20 మంది ఇదే అలవాటుగా చేసుకున్నారు. వీరిలో 14 మంది మరణించగా..మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. మద్యం ధరలు అధికంగా ఉండటం వల్లే..శానిటైజర్ తాగుతున్నామని మందుబాబులు చెబుతున్నారు.
మద్యం మత్తుకు కడప జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ఆరుగురు బలయ్యారు. పెండ్రిమర్రిలో ముగ్గురు, కడపలో ఒకరు, చెన్నూరులో ఇద్దరు శానిటైజర్ తాగి మృతి చెందారు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు..సుమారు 30మంది శానిటైజర్ తాగుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కొంత మంది మత్తు బాబులకు, ఔషధ దుకాణదారులను పీఎస్‌కి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
మద్యం ధరలు పెంచటం ద్వారా ఆ అలవాటుకు వ్యసనపరులను దూరం చేయొచ్చని ప్రభుత్వం భావించినా..మద్యం ప్రియులు మాత్రం అలవాటుని మానకపోగా...అడ్డదారులు వెతుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.