People Protest for Bugga Vanka Bridge: కడప నడిబొడ్డన ఉన్న బుగ్గవంక.. భారీ వర్షాలు కురిస్తే పోటెత్తుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతుంది. దీనివల్ల ఏటా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2001లో బుగ్గవంక వరదలకు కొందరి ప్రాణాలు కూడా పోయాయి. 2020 నవంబర్‌లో కాలనీలను ముంచెత్తిన బుగ్గవంక వరద.. భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. సరైన రక్షణ గోడలు లేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోందని విమర్శలు రావడంతో.. ప్రభుత్వం రక్షణ గోడ నిర్మించింది. అయితే.. రవీంద్రనగర్-గుర్రాలగడ్డ మధ్యనున్న మెటికల వంతెనపై ఈ రక్షణ గోడను నిర్మించడంతో.. పాత సమస్య తీరడం సంగతేమో కానీ, కొత్త కష్టం వచ్చి పడింది.
రవీంద్ర నగర్-గుర్రాలగెడ్డ వంతెన మీదుగా తమ కాలనీలకు రాకపోకలు సాగించే ముస్లింలు.. 2 కిలోమీటర్లు తిరిగొస్తే తప్ప నగరంలోకి ప్రవేశించడం సాధ్యం కావడం లేదు. చుట్టూ తిరిగి వెళ్లలేని చాలామంది.. రక్షణ గోడకున్న మురుగునీటి గొట్టంలో నుంచే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి మొత్తుకుంటున్నా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో చలనం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ గోడ మీదుగా వంతెన నిర్మించకపోతే ఓట్లు అడగనన్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా.. అదే మాట మీద నిలబడతారా అని ప్రశ్నిస్తున్నారు. బుగ్గవంక సమీపంలోని గుర్రాలగడ్డ ప్రాంతంలో వేల మంది ముస్లింలు నివాసం ఉంటున్నారు. వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే రవీంద్రనగర్ షామారియా మసీదుకి మృతదేహాన్ని తీసుకెళ్లి.. అక్కడి నుంచి శ్మశానానికి తరలించేవారు. కానీ అడ్డుగా రక్షణ గోడ నిర్మించడంతో.. పాత బస్టాండు మీదుగా మృతదేహాన్ని మోసుకుంటూ 2 కిలోమీటర్లు చుట్టి రావాల్సి వస్తోందని ముస్లింలు వాపోతున్నారు.
"దాదాపు నాలుగు డివిజన్లకు అనుసంధానమైన బ్రిడ్జి ఇది. ఈ బుగ్గవంక రక్షణ గోడపై వంతెన నిర్మించిన తర్వాతే ఓట్లు అడుగుతామని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాటిచ్చారు. ఇప్పుడు ఆయన అదే మాట మీటమీద ఉండాలి. మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉంటారో లేదో చూస్తాం. రవీంద్ర నగర్-గుర్రాలగెడ్డ వంతెన మీదుగా మా కాలనీలకు రాకపోకలు సాగించాలంటే.. 2 కిలోమీటర్లు తిరిగొస్తే తప్ప నగరంలోకి ప్రవేశించడం సాధ్యం కావడం లేదు. చుట్టూ తిరిగి వెళ్లక మేము రక్షణ గోడకున్న మురుగునీటి గొట్టంలో నుంచే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నాము. దీనిపై మేము రెండేళ్ల నుంచి మొత్తుకుంటున్నా ప్రజాప్రతినిధులు, అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి బుగ్గవంక రక్షణ గోడపై వంతెన నిర్మించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. " - స్థానికులు