కడప జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉద్యాన పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. జిల్లాలో సుమారు 4 లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూములు ఉండగా.. అందులో లక్ష హెక్టార్లలో మెట్ట భూమి ఉంది. ఇందులో ఆరుతడి పంటల కింద మామిడి, టమాట, బొప్పాయి, చీనీ వంటి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో రసాయనిక మందులకు బదులు సహజసిద్ధంగా తయారుచేసిన జీవామృతం వాడుతూ మంచి దిగుబడులు పొందుతున్నారు.
జిల్లా ఉద్యానశాఖ, వ్యవసాయ అనుబంధ స్వచ్ఛంద సంస్థలు సేంద్రీయ విధానం అమలుచేసేలా రైతు మిత్ర సంఘాలు ఏర్పాటు చేయించి అన్నదాతలకు సూచనలు ఇస్తున్నారు. మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే బొప్పాయి పంటను జిల్లాలో అత్యధికంగా సాగుచేశారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల నియోజకవర్గాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో బొప్పాయి సాగు ఉంది.
బీవీఆర్ ఆర్గానిక్ అనే స్వచ్ఛంద సంస్థ రైతులకు దైవం అనే బొప్పాయి రకం విత్తనాలు అందించి.. వాటి సాగుకు అవసరమైన మెళకువలను వ్యవసాయ మిత్రల ద్వారా రైతులకు సూచించారు. ఈ పద్ధతుల్లో సాగుచేసి సంబేపల్లి మండలం మోటకట్లలో నరసింహులు అనే రైతు 10 ఎకరాల్లో బొప్పాయి సాగుచేసి మంచి దిగుబడులు సాధించాడు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేయటంతో కొనుగోలుదారులు తోట వద్దకే వచ్చి పంటను కొంటున్నట్లు చెప్పారు. తమ ఆర్గానిక్ ద్వారా వివిధ రకాల పంటలను 800 మంది అన్నదాతలు సాగు చేశారని బీవీఆర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సేంద్రీయ పద్ధతులు అవలంబించడం ద్వారా ఆరోగ్యవంతమైన దిగుబడులు పొందవచ్చని వివరించారు.
ఇవీ చదవండి...
పవర్ బ్యాంక్ ఆర్డర్ చేస్తే.. అమెజాన్ రెడ్ మీ ఫోన్ ఇచ్చింది!