కడప జిల్లాలో అటవీశాఖ అధికారులు చేపట్టిన నాలుగో విడత పులుల గణన ముగిసింది. గతంలో కంటే ఈసారి జిల్లాలో పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి నాలుగో విడత పులుల గణన ప్రారంభమైంది. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్లలో అధికారులు పులుల గణన చేపట్టారు. కడప డివిజన్ పరిధిలోని సిద్దవటం, కడప, రాయచోటి, ఒంటిమిట్ట రేంజిలలో 112 కెమెరాలను అమర్చారు. ప్రొద్దుటూరు డివిజన్‌లో వనిపెంట, పోరుమామిళ్ల, బద్వేలు రేంజిలలో 66 కెమెరాలు అమర్చారు. వీటిలో నమోదైన వన్యప్రాణుల చిత్రాలను అధికారులు పరిశీలించారు. కడప డివిజన్‌లో పులుల జాడ కనిపించలేదని సిద్దవటం అటవీక్షేత్రాధికారి ప్రసాద్ చెప్పారు. ప్రొద్దుటూరు డివిజన్‌లోని రెండు రేంజిలలో 6 పులులు కెమెరాల్లో కనిపించినట్లు గుర్తించారు. వాటి సంఖ్యను కచ్చితంగా నిర్ధారించేందుకు ఆ చిత్రాలను శ్రీశైలంలోని బయోల్యాబ్‌కు పంపనున్నట్లు ప్రొద్దుటూరు డివిజన్ అటవీ సంరక్షణాధికారి నాగార్జునరెడ్డి చెప్పారు.
ఇదీ చదవండీ.. అట్టపెట్టెలో శిశువు.. గుర్తించిన కాటికాపరి