నీటి విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమ వాసిగా...సమర్థిస్తున్నానని తెదేపా శాసన మండలి సభ్యులు బీటెక్ రవి అన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పట్టిసీమ నిర్మిస్తే... దానిపై అప్పటి వైకాపా వాళ్లు లేనిపోని ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు పట్టిసీమ నీళ్లు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కూడా వస్తున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
మనకు రావాల్సిన నీటిని ఇవ్వకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోవడం తగదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందనే విషయం ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఎంతో తెలివిగా వ్యవహరించి విద్యుత్ బిల్లులను పెంచారని రవి మండిపడ్డారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని... చీనీ రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కాదని ఆవేదన వ్యక్తం చేశారు.