మామిడి పూత చూస్తే చాలు... అందరి మోముల్లో చిరునవ్వులు విరుస్తాయి. ఇక రైతులు గురించి ప్రత్యేకించి చెప్పాలా... ఏడాదికి ఒక్కసారి కాసులు కురిపించే పంట కోసం.. ఆడుకునేందుకు వెళ్ళిన పసి బిడ్డ రాకకై, తల్లి ఎంతలా ఎదురు చూస్తుందో... అంతలా ఎదురు చూస్తాడు. అలాంటిది ఈసారి మాత్రం మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలు కష్టాలు తెస్తాయని ఆందోళన పడుతున్నారు. ఎప్పుడూ.. డిసెంబర్లోనే చిగురించే మామిడి... ఫిబ్రవరి వచ్చినా పూత సరిగా రాకపోవడంతో దిగులు చెందుతున్నాడు.
మామిడి పంటలో పూత దశ అత్యంత ముఖ్యమైనది. మామిడి దిగుబడి అంతా పూత పైనే ఆధారపడి ఉంటుంది. సంవత్సరమంతా పూత కోసం, చెట్టును కాపాడుకుంటున్న రైతుకు... పూత సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు దిగుబడి తగ్గిపోతోంది. పూత ఆలస్యంగా రావడంతో ధరలు తగ్గిపోతాయని, ఏప్రిల్ - మే నెలలో వచ్చే వడగండ్ల వానలు, గాలి దుమారాలు తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆందోళన చెందుతున్నాడు.
అయితే.. వాతావరణంలోని మార్పుల కారణంగా పూత ఆలస్యంగా వస్తోందని వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అంటున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో మూడు సార్లు మందుల పిచికారీ చేసినట్లయితే ఎలాంటి నష్టం వాటిల్లదంటున్నారు.
ఇది చూడండి...