కడపజిల్లా వల్లూరు మండలం అధినిమ్మాయపల్లె ఆనకట్ట వద్ద యువకుడి మృతదేహం లభించింది. ఆనకట్ట వద్ద పెన్నానదిలో మంగళవారం సాయంత్రం కమలాపురం పట్టణానికి చెందిన యువకుడు గంపా రెడ్డయ్య (16) గల్లంతయ్యాడు. రెడ్డయ్య స్నేహితులతో కలసి సరదాగా ఆనకట్టకు వెళ్లాడు. నదిలో దిగి స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం పొద్దుపోయేవరకు గాలింపు చర్యలు చేపట్టినా పలితం లేకుండా పోయింది. ఈరోజు ఉదయం 11:30 సమయంలో శవాన్ని వెలికి తీశారు.
ఒక్కగానొక్క కొడుకు
కమలాపురానికి చెందిన దంపతులు శ్రీను, వెంకటసుబ్బమ్మ బేల్దారి పనిచేస్తూ జీవనం సాగించేవారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. రెడ్డయ్య ఒక్కగానొక్క కుమారుడు. 5 ఏళ్ల క్రితం శ్రీను అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుంచి వెంకట సుబ్బమ్మ ఉపాధి పనులు, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. చేతికంది వచ్చే సమయంలో ఒక్కగానొక్క కొడుకు పెన్నానదిలో గల్లంతు కావడంతో వెంకట సుబ్బమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది. కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడునుకున్న కొడుకు మరణం ఆ తల్లికి తీరని శోకం మిగిల్చింది.
ఇదీ చదవండి: