పారిశ్రామికంగా కడప జిల్లా మరింతగా అభివృద్ధి సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 30 భారీ పరిశ్రమలు ఉండగా.. మరో 14 ఏర్పాటు కానున్నాయి. వీటికి సంబంధించి భూసేకరణ, మైనింగ్ కేటాయింపులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. 32 వేల 129 కోట్ల రూపాయల పెట్టుబడితో 35 వేల 774 మందికి ఉపాధి దక్కుతుందని అధికారులు భావిస్తున్నారు.
కడప జిల్లాలోనే భారీ ప్రాజెక్టు ఉక్కు పరిశ్రమ ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె వద్ద ఏర్పాటుకానుంది. రూ. 15 వేల కోట్ల పెట్టుబడితో.. ఏడాదికి 30 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కనుంది.
మైలవరం వద్ద ఏసీసీ సిమెంట్స్ లిమిటెడ్ పరిశ్రమ 9 వేల 415 కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు వస్తోంది. దువ్వూరు మండలం కానగూడూరు-జిల్లేల వద్ద 500 మెగావాట్ల సామర్థ్యంతో పవన నరసింహస్వామి సోలార్ పార్కు ఏర్పాటుకానుంది. రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల 15 వందల మందికి ఉపాధి దక్కనుంది.
ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వి వద్ద తేజ సిమెంట్ సంస్థ... 15 వందల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పనుంది. గాలివీడు మండలం తూముకుంట వద్ద ఎఫ్ఆర్వీ ఆంధ్రప్రదేశ్ సోలార్ ఫారం-1 కింద50 మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటు కానుంది. 335 కోట్ల రూపాయలతో నిర్మించే దీని కోసం 250 ఎకరాలు కేటాయించారు. వెలిగల్లు వద్ద ఎఫ్ఆర్వీ ఇండియా సోలార్ పార్కు-2 కింద 50 మెగావాట్ల సోలార్ పరిశ్రమకు మరో 250 ఎకరాల భూమి సేకరించారు.
పులివెందులలో ఓ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కొప్పర్తి వద్ద బేరియం కెమికల్స్ రబ్బర్, అల్యూమినియం ఎలక్ట్రికల్ పరిశ్రమ సహా అనేక ఇతర పరిశ్రమలూ జిల్లాలో ఏర్పాటుకానున్నాయి.
ఇవీ చదవండి: