కడపజిల్లా ఖాజీపేట మండలం మాచుపల్లెలో.. సర్వేనంబరు 11లో 2740 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇది శోత్రియం భూమి. ప్రస్తుతం ఇది రిజర్వు ఫారెస్ట్ కింద ఉన్నట్లు.... ప్రభుత్వ మీ భూమి వెబ్‌సైట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ సర్వేనంబర్ 11లోని 506, 506-A, 507లో... దాదాపు వందెకరాల్లో కంచె వేశారు. వాటిలో పండ్ల మొక్కలూ నాటారు. బోర్లు, విద్యుత్ స్తంభాలూ వేశారు. స్థానిక వైకాపా నాయకులు రెండు నెలల్లో ఇక్కడ సాగు చేసేశారని.. సమీపంలోని పట్టా భూమి రైతు ఆరోపించారు. తన భూమి కూడా అమ్మాలని ఒత్తిడి తెస్తున్నారని, ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు కూడా చేశానని వాపోయారు.
తెలుగుదేశం నేతలు సర్వేనంబర్11లోని భూముల వివరాలను ఆన్‌లైన్‌లో... పరిశీలించారు. అడంగల్ ప్రకారం అవి అటవీ భూములని తెలుసుకుని.. క్షేత్రస్థాయి పరిశీలనకు మీడియాను వెంటతీసుకెళ్లారు. విషయం తెలిసి వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అనుచరులు ముందే అక్కడికి చేరుకున్నారు. కంచె వేసిన భూమి లోపలికి ఎవ్వర్నీ వెళ్లనివ్వకుండా నిలువరించారు. తెదేపా నేత పుట్టా సుధాకర్ యాదవ్‌తో వాగ్వాదానికి దిగారు. అటవీ భూమిలో బోర్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ఎలా అనుమతిచ్చారని.. తెలుగుదేశం నేతలు నిలదీశారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. బినామీ పేర్లతో ఆక్రమించారని ఆరోపించారు. ఈ కబ్జాను ఆపకపోతే.. కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అనుచరులు మాత్రం. కబ్జాకు తావులేదన్నారు. 2004కు ముందు సదరు భూముల్ని ఓ వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నారని.. అతని నుంచి తాము ఇటీవల రిజిస్టర్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. కబ్జా ఆరోపణలపై ఇంత రాజకీయ రచ్చ జరుగుతుంటే నిగ్గుతేల్చాల్సిన జిల్లా యంత్రాంగం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.