కడప జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు కుందూ, పెన్నా నదులలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటి విడుదల కొనసాగుతోంది. ఐదు గేట్ల ద్వారా 17 వేల క్యూసెక్కులే నీటిని వదులుతున్నారు. మైలవరం జలాశయం సామర్థ్యం ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.66 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో... సమీప ప్రాంతాల్లోని వందలాది ఎకరాలు నీట మునిగాయి.
కుందు నదిలో 56 వేల క్యూసెక్కులు ... పెన్నా నదిలో లక్షా ఇరవై వేల 250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఒంటిమిట్టలోని తాగునీటి పంప్ హౌస్ నీట మునగడంతో... ఆయా గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నదులకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు అధికంగా వస్తుండటంతో చేపల వేట, ఈతకు వెళ్లడం నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. రైతులు పంట పొలాల వద్దకు చేరుకొని... నీట మునిగిన పొలాలను చూసి ఆవేదన చెందుతున్నారు