రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి.. వాటి నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు వివరించాలని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. నిధుల కొరతతో కేవలం 1500 ఎకరాల్లోనే రాజధాని నిర్మాణం చేస్తానని గతంలో చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. నేడు మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కడప జిల్లా జమ్మలమడుగులో కూడా రెండు చోట్ల ఇప్పటికే ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపనలు జరిగినా.... మళ్లీ మూడో ప్రదేశంలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవ్వడంపై ఆయన ఆగ్రహించారు. మైలవరం మండలంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తే.... నేడు జగన్ మోహన్ రెడ్డి జమ్మలమడుగు మండలంలో మరో ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారని కడపలో విమర్శించారు.