ఏపీ, కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం సమీపంలో ఇనుప ఖనిజ తవ్వకాల లీజు, విక్రయాలకు టెండర్లు పిలిచిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ.. తాజాగా లీజు నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ లీజు కింద తవ్వి తీసిన ఖనిజాన్ని తొలి ప్రాధాన్యంగా కడపలో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమకు ఇవ్వాలంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్ మండలం హెచ్.సిద్ధాపురంలోని ఏపీఎండీసీకి గతంలో 25 హెక్టార్ల ఇనుప ఖనిజ లీజు కేటాయించారు. ఇందులో 40 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు అంచనా. దీనికి మైన్ డెవలపర్, ఆపరేటర్ కోసం గత నెల టెండర్లు పిలిచారు. ఇందులో అయిదు సంస్థలు బిడ్లు వేశాయి.
ఉత్పత్తి చేసిన ఖనిజంలో 75 శాతం
లీజు దక్కించుకునే సంస్థ..తవ్వితీసి, ఉత్పత్తి చేసే ఇనుప ఖనిజంలో 75 శాతం కడపలో ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్‌కు ఇవ్వాలని తాజాగా నిబంధన విధించారు. మిగిలిన ఖనిజాన్ని ఈ-వేలం ద్వారా లీజు పొందిన సంస్థ విక్రయించుకునే అవకాశం కల్పించారు. ఒకవేళ కడప స్టీల్ అంత ఖనిజాన్ని వినియోగించుకోలేకపోతే..దానిని కూడా విక్రయించుకునే వీలుందని పేర్కొన్నారు. సవరించిన నిబంధనల మేరకు మళ్లీ టెండర్లు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 3 వరకు గడువు విధించారు.
ఇదీ చదవండి
ys viveka murder case: 76వ రోజు విచారణ.. సమాచారమిస్తే రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటన