పంచాయతీ రణం.. అధికారుల్లో అయోమయం - కడపలో ఎన్నికల నియమావళి అమలులోకి
రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శుక్రవారం షెడ్యూలు విడుదల చేయడంతో కడప జిల్లా అధికారుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముందుకు వెళ్లాలా వద్దా తెలియక స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం నుంచి గ్రామాల్లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినట్టు జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కడప జిల్లా అధికారుల్లో అయోమయం నెలకొంది. ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాలు.. మరోవైపు ప్రభుత్వ ఘర్షణాత్మక వైఖరి నడుమ అధికారులు అయోమయంలో పడ్డారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం షెడ్యూలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 23న తొలి దశ, 27న రెండు, 31న మూడు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించలేమన్నది ప్రభుత్వ వాదన. ఈ పిటిషన్ రేపు విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో శనివారం నుంచే గ్రామాల్లో ఎన్నికల నియమావళి(కోడ్) అమల్లోకి వచ్చింది. జిల్లాలో గత కొన్నిరోజులుగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై సందిగ్ధత ఏర్పడింది. దీంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ఎలా ముందడుగు వేయాలా అని అధికారుల్లో సందేహాలు మొదలయ్యాయి.
రిజర్వేషన్లు ఇలా..
2018 ఆగస్టు నెలలో పల్లె పాలకుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూలు విడుదల చేశారు. ఆ తరువాత కరోనా కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. అప్పట్లో జిల్లా అధికారులు గ్రామ పంచాయతీ స్థానాలకు రిజర్వేషన్లు సైతం ఖరారు చేశారు. ఇప్పుడు దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 807 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ కలెక్టర్ హరికిరణ్ 2020 మార్చి 8న గెజిట్ జారీ చేశారు. మొత్తం 807 సర్పంచి స్థానాలకు గాను ఎస్టీలకు 17, ఎస్సీలకు 148, బీసీలకు 225, అన్‌రిజర్వుడుకు 417 ప్రకటించారు. వీటిలోనే 415 స్థానాలను మహిళలకు కేటాయించారు.
రాజుకున్న రాజకీయ వేడి..
జిల్లాలో రాజకీయ వేడి పెరిగింది. పంచాయతీ ఎన్నికలను పార్టీ రహితంగా నిర్వహిస్తారు. కొందరు అభ్యర్థులకు పార్టీలు మద్దతు ఇస్తుండడంతో రాజకీయంగా సందడి మొదలైంది. తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను విజయపథంలో నడిపిస్తాయని వైకాపా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని ఆ పార్టీ చెబుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెదేపా దృష్టిసారిస్తోంది. జిల్లాలో పలువురు బలమైన నాయకులు ఉండడంతో తమ సత్తా చాటడానికి భాజపా సిద్ధమవుతోంది. మిగిలిన పార్టీల్లో కూడా ఎన్నికల ప్రకటనతో నూతనోత్సాహం వచ్చింది.
స్పష్టత రావాల్సి ఉంది..
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఎన్నికల కోసం గతంలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశాం. ఆ ప్రకారమే ముందుకు వెళ్తాం. ఎస్‌ఈసీ షెడ్యూలు విడుదల చేయడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది.
- హరికిరణ్, కలెక్టర్, కడప
ఇదీ చదవండి: సీఎం జగన్‌కే మాల మహానాడు మద్దతు: కారెం శివాజీ