కడప జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ బ్యాంకుల అధికారులతో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (DLIC) సమీక్షా సమావేశం నిర్వహించారు. టార్గెటెడ్ ఫైనాన్సియల్ ఇంక్లూసియన్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం (TFIIP)లో భాగంగా జిల్లాలోని అన్ని శాఖల బ్యాంకు అధికారులు ఆర్ధిక ప్రగతి లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ అన్నారు. టీఎఫ్‌ఐఐపీలో ప్రధానంగా.. అకౌంట్ ఓపెనింగ్, ప్రధాన మంత్రి స్వనిధి భీమా యోజన, ప్రధాన మంత్రి జన్ ధన్ బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలు అమలు చేయడంలో జిల్లా ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని అధిగమించేందుకు బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ముందుకెళ్లాలన్నారు.
అకౌంట్ల ఓపెనింగ్ విషయంలో జిల్లా 99% సఫలత సాధించిందన్నారు. పీఎంజేజేవై, పీఎంఎస్ బివై, అటల్ పెన్షన్ యోజన పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పథకాలకు సంబంధించి అన్ని బ్యాంకులు వారికి కేటాయించిన లక్ష్యాలను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. రైతు భరోసా, "0" వడ్డీ ప్రభుత్వ పథకాల ఆర్ధిక సహాయంలకు సంబంధించి బ్యాంకర్ల నుంచి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రూ.13,500 కోట్లతో రుణ ప్రణాళిక ఆమోదం
2021-22 కి సంబంధించి రూ.13,500 కోట్ల లక్ష్యంతో రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆమోదించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.7,660 కోట్లు కేటాయించగా, వ్యవసాయేతర మరియు ప్రాధాన్యతా రంగాలకు రూ.2,940 కోట్లు, ఇతర రంగాలకు రూ.2,900 కోట్లు రుణ లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించి జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఎల్.డి.ఎం. చంద్రశేఖర్, నాబార్డు డిడిఎం విజయ్, ఎస్.బి.ఐ. ఆర్ఎం. మల్లికార్జున, యూబీఐ ఆర్.ఎం. జననీ, ఏపీజీబి ఆర్.ఎం.లు శైలేంద్రనాధ్, శ్రీదేవి, కెనెరా బ్యాంకు ఆర్ఎం సూర్యనారాయణ, ఇంఛార్జ్ సీపీఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. Mahanadu-2: ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు