కడప జిల్లా రైతులు గత కొన్ని ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సుమారు 50 వేల మంది రైతులు ఈ బాటలో పయనిస్తున్నారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గత 17 ఏళ్లగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ... ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఆదర్శరైతు అవార్డు గ్రహీత వరప్రసాద్. రాజంపేట మండలం హస్తవరం గ్రామానికి చెందిన వరప్రసాద్... ప్రకృతిపరమైన కషాయాలు, మిశ్రమాలు ఎరువులుగా ఉపయోగిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. 2003లో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెట్టిన వరప్రసాద్...2007లో ప్రొఫెసర్ పాలేకర్ నుంచి సేంద్రీయ వ్యవసాయ మెళకువలు నేర్చుకున్నారు.
తనకున్న 14 ఎకరాల భూమిలో 10 ఎకరాల్లో జామ, బొప్పాయి, మునగ సాగుచేస్తున్నారు. ఈ పంటలకు అంతర పంటలుగా 25రకాల కూరగాయలు పండిస్తున్నారు. ప్రతీ రైతు ఒక పంటపై ఆధారపడకుండా...అంతర పంటలు సైతం సాగుచేయాలని వరప్రసాద్ అంటున్నారు. ప్రధాన పంట సరిగ్గా పండకపోయినా... అంతరపంటలు ఆదుకుంటాయని ఆయన చెబుతున్నారు. ఇదే సూత్రాన్ని తాను 17ఏళ్లుగా పాటిస్తున్నట్లు వరప్రసాద్ తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధిస్తున్న వరప్రసాద్... గతంలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. 2005లో జిల్లా ఆదర్శ రైతు అవార్డు పొందారు. జాతీయ ఫెలోషిప్ అవార్డును ఎం.ఎస్.స్వామినాథన్ చేతుల మీదుగా అందుకున్నారు. 17 సంవత్సరాల్లో 14 అవార్డులు పొందిన వరప్రసాద్... ఇటీవల ఇన్నోవేషన్ అవార్డు సాధించారు. రాజంపేట రెవిన్యూ డివిజన్లో తొలిసారిగా వ్యవసాయానికి డ్రిప్ పద్ధతి అమలు చేసిన ఘనత ఈయన సొంతం.
అంతర పంటల వల్ల మిత్ర పురుగులు, శత్రు పురుగులను నాశనం చేస్తాయని వరప్రసాద్ అంటున్నారు. జీవామృతానికి తోడు డీకంపోజ్డ్ ఎరువు కూడా వాడుతున్నట్లు తెలిపారు. శత్రు కీటకాలను నాశనం చేసేందుకు సోలార్ బల్బులు ఉపయోగిస్తున్నామన్నారు. ఈ బల్బులు వల్ల శత్రు పురుగులు మాత్రమే చనిపోయి... మిత్ర పురుగులకు మేలు జరుగుతుందని వరప్రసాద్ తెలియజేశారు. వ్యవసాయానికి సౌరవిద్యుత్ పరికరాలనే ఉపయోగిస్తున్నారు. వరప్రసాద్ సలహాలతో మంచి దిగుబడులు సాధిస్తున్నట్లు ఆయన బంధువులు చెబుతున్నారు.
ప్రణాళిక బద్ధంగా... ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, దిగుబడులకు దిగుబడి సాధించవచ్చని అంటున్నారు ఆదర్శ రైతు వరప్రసాద్.
ఇదీ చదవండి: