నిర్ణీత సమయంలో సేవలను అందించకపోతే జీతాల్లో కోత విధిస్తామని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కడప కలెక్టర్ సి.హరికిరణ్ హెచ్చరించారు. అగాడీ వీధిలోని 36/1, 36/2 వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల ఆరా తీశారు.
వారం రోజులుగా ప్రజల నుంచి రోజుకో సేవా అభ్యర్థన అందకపోవడంతో.. సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు జనం ముందుకెళ్లి పని చేయడం లేదనేది స్పష్టమవుతోందన్నారు. నగరం నడిబొడ్డులో ఉన్నా అర్జీలు రాలేదంటే.. సిబ్బంది పనితీరు అర్థమవుతోందని మండిపడ్డారు.
వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ.. సచివాలయాల ద్వారా ఎటువంటి సేవలు పొందవచ్చో ప్రజలకు వివరించాలన్నారు. వారికి అవసరమైన సేవలు, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు.. సచివాలయాలను సద్వినియోగించుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ నెలలో పనితీరు మెరుగుపరుచుకోకపోతే జీతాలు నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: డీఎడ్ పరీక్షలకు అనుమతించాలంటూ కలెక్టరేట్ ముట్టడి