కడప జిల్లా రాజంపేట మండలంలో ఆకేపాడు గ్రామంలో ఒకేరోజు పలు ఆలయాల్లో హుండీ చోరీలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి హుండీలను అపహరించుకుపోయారు. కొన్ని ఆలయాల్లో హుండీలు కనిపించకపోగా.. మరికొన్ని ఆలయాల్లో హుండీలను ఆలయాల సమీపంలో పడేశారు. ఆకేపాడు ప్రాంతంలో ఒకేరోజు పలు ఆలయాల్లో చోరీలు జరగడంతో డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఐ నరేందర్ రెడ్డి, ఎస్సై షేక్ రోషన్లతో కలిసి చోరీ జరిగిన ఆలయాలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు కడప నుంచి వేలిముద్ర నిపుణులను పిలిపించారు.
ఆలయాల్లో చిన్న చిన్న హుండీలు మాత్రమే చోరీకి గురయ్యాయని డీఎస్పీ శివ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఆలయాల్లోని విగ్రహాలకు ఎలాంటి నష్టం జరగలేదని అన్నారు. ఈ చోరీకి పాల్పడిన వ్యక్తులను రెండు మూడు రోజుల్లో పట్టుకుంటామని ఆయన చెప్పారు.
మండలంలోని మంత్రం ప్రాంతంలో కూడా ఆలయాల్లో చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
చోరీ జరిగిన ఆలయాలు..
- పెద్దూరులోని మహేశ్వర స్వామి ఆలయం
- లచ్చయ్యగారిపల్లిలోని ఎల్లమ్మ ఆలయం, మారమ్మ ఆలయం, నలజాలమ్మ ఆలయం
- అన్నమయ్య జలాశయానికి వెళ్లే మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయం
ఇదీ చదవండి: విగ్రహాలపై దాడులను అరికట్టేందుకు నిఘా కట్టుదిట్టం