కడప జిల్లాలో నివర్ తుఫాను ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సరిహద్దు గా ఉన్న... రాయచోటి ,రాజంపేట ,రైల్వే కోడూరు నియోజకవర్గంలోనే అతి భారీ వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లోని చెరువులు కుంటలు నిండి నీరు వెలుపలకు ప్రవహిస్తోంది. రాయచోటికి తలమానికంగా ఉన్న మాండవ్య నది వరద నీటితో ఉప్పొంగుతుంది. నది ఒడ్డున ఉన్న వ్యవసాయ విద్యుత్ లైన్లు , రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు వేలాదిగా కొట్టుకుపోయాయి. పరివాహక ప్రాంతంలోకి వరద నీరు వచ్చి చేరటంతో వరి , వేరుశనగ పంటలు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ నది చిత్తూరు జిల్లాలో ఉద్భవించి రాయచోటి నియోజవర్గంలో ప్రవహిస్తూ నెల్లూరు జిల్లాలోనీ సోమశిల ప్రాజెక్టుకు చేరుతుంది.
వెలిగల్లు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు నీటిమట్టం నాలుగు టీఎంసీలకు పెరిగింది. రాజంపేట సమీపంలోని చెయ్యరు పై నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు నుంచి గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు . తిరుమలగిరి నుంచి వచ్చే గుంజన నది రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఉద్ధృతంగా ప్రవహిస్తూ దిగువన నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. 20 ఏళ్లుగా చూడని నీటి ప్రవాహం నేడు నదులలో కనిపించినా... రైతులకు మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్న వేదన కనిపిస్తోంది .
రాయచోటి సమీపంలోని మాండవ్య నది ఒడ్డున ఉన్న సుమారు 100 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎడతెరిపిలేని వర్షంతో రెండు రోజులుగా ముగ జీవాలు మేతకు కూడా వెళ్లలేక ఇబ్బంది పడ్డాయి.
ఇదీ చదవండీ...'నివర్' ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి అనిల్ వీడియో కాన్ఫరెన్స్