కడప జిల్లా వల్లూరు మండలం దుగ్గాయపల్లె గ్రామస్థులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని దాదాపు 300 కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కరోనా రాకతో వారు నేసిన ఉత్పత్తులకు గిరాకీ తగ్గిపోయింది. ఆ కష్టం నుంచి బయటపడేలోపు ఇటీవల కురిసిన వర్షాలు వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మగ్గాల్లో వర్షపు నీరు చేరటంతో పని చేసుకోవటం కష్టంగా మారిందని వారు తెలిపారు. నీటిని తోడినా మళ్లీ ఊరుతోందని వారు చెప్పారు.
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం అప్పులు తీర్చడానికే సరిపోయిందని వారు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిపై ఆధారపడి ఉన్నామని... వేరే పని చేసుకోలేకపోతున్నామని వెల్లడించారు. ఆదాయ మార్గం లేకపోవటంతో కుటుంబపోషణ సైతం కష్టంగా మారిందని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘాలు తమకు చేయూత అందిస్తేనే కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
ఇదీ చదవండి