Illegal Ganja Transportation From Vizag To Kadapa : వైఎస్ఆర్ జిల్లాలో ఇటీవల పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎస్‌ఈబీ)పోలీసులు, ఇతర సిబ్బందితో కలిసి జిల్లాలోని సుమారు 15 ప్రాంతాల్లో దాడులు చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ 40 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు చేశారు. వైజాగ్ నుంచి గంజాయిని పెద్ద మొత్తంలో అక్రమంగా సరఫరా చేస్తున్న అనకాపల్లికి చెందిన కిరణ్ కుమార్, సందీప్, చింతలపల్లికి చెందిన మస్తానయ్యలను అరెస్టు చేశారు.
కిరణ్ కుమార్‌పై ఇప్పటికే 14 కేసులు, సందీప్‌పై రెండు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అంతేకాక ఈ గంజాయిని జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో విక్రయానికి స్థానిక వ్యాపారులకు అందిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మైదుకూరులో పుల్లయ్య, ఖాదర్ బాషా, కమలాపురంలో పూజారి శివయ్య, రైల్వే కోడూరులో వినయ్ కుమార్, సిద్ధవటంలో చంద్రశేఖర్‌లు తీసుకుని తిరిగి చిల్లర విక్రయదారులకు ఇస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ అక్రమ రవాణాదారులు, హోల్ సేల్ దారులతో పాటు, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి జనాలకు విక్రయిస్తున్న మరో పది మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
వైజాగ్ నుంచి రైలు, కార్లలో అక్రమంగా తరలిస్తున్నారని, దీని వెనుక ఉన్న ఇంకొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నట్లు జిల్లా ఎస్పీ కేకే ఎన్ అన్బురాజన్ తెలిపారు. మైదుకూరు, కడప వన్‌టౌన్, పోరుమామిళ్ల, కమలాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున జరిగిన దాడుల్లో ఎస్ఈబీతో పాటు మొత్తం 40 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్పీ చెప్పారు. 19 మందిని అరెస్టు చేశారని, 28 కేజీల గంజాయి, కారు, 4 బైక్‌లు స్వాధీనం చెసుకున్నట్టు తెలిపారు. గంజాయి విక్రేతల నుంచి సేకరించిన సమాచారంతో గంజాయి వినియోగానికి అలవాటు పడిన సుమారు 30 మంది యువతను గుర్తించామని, వారికి కడప రిమ్స్‌లోని రీ హాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
వైజాగ్ నుంచి జిల్లాకు భారీగా గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక నుంచి ముమ్మరంగా గంజాయి దాడులు కొనసాగుతాయని ప్రజలు కూడా సహకారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
"19 మందిని అరెస్ట్ చేశాము. వీళ్ల దగ్గర నుంచి 28 కేజీల గంజాయి స్వాధీనం చేయడం జరిగింది. 40 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 15 ప్రాంతాల్లో దాడులు చేశాము. వీరితో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్లను కూడా అరెస్టు చేయడం జరుగుతుంది." - అన్బురాజన్, ఎస్పీ
ఇవీ చదవండి