గండికోట విశిష్టతను తెలిపేందుకు, అవగాహన సదస్సులు
గండికోట విశిష్టతను తెలిపేందుకు చేపడతున్న ఉత్సవాల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజంపేటలో నేడు జానపద కళాకారులతో నృత్యాలు, శోభాయాత్ర నిర్వహిస్తారు. రేపు కడపలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి మున్సిపల్ మైదానం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం నేక్ నామ్ ఖాన్ కళాక్షేత్రంలో చింతామణి, బాలనాగమ్మ నాటక ప్రదర్శన జరుగుతుంది. 8న ప్రొద్దుటూరులో కళాకారుల చేత నృత్యాలు, పాటలు, కోలాటాలు శోభాయాత్ర,బైక్ ర్యాలీని నిర్వహిస్తారు. 9 తేది జమ్మలమడుగులో కూడా శోభాయాత్ర ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమాల్లో భాగంగా ఈ సారి ప్రత్యేకంగా ఎయిర్ షో నిర్వహించనున్నారు.
గండికోట వద్ద రెండు ప్రధాన వేదికలను సిద్ధం చేస్తున్నారు. వాటికి మొల్లమాంబ, అన్నమయ్య వేదికలుగా నామకరణం చేశారు. ఇక్కడ రోజంతా స్థానిక కళాకారులు, సినీ ప్రముఖుల చేత గాన కచేరి ఏర్పాటు చేశారు. మంత్రులు అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్, ఆదినారాయణ పాల్గొనున్నారు.
ఉత్సవాల్లో పాల్గొనేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, కళాకారులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 22 కమిటీలతో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.