భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలిస్తున్న సమయంలో మద్రాసు నుంచి ముంబయికి ‘మెయిల్’ రైలు ప్రయాణికులతో బయలుదేరింది. 1902 సంవత్సరం సెప్టెంబరు 12వ తేదీన కడప జిల్లా మంగపట్నం రైల్వేస్టేషన్‌కు చేరింది. ఆ సమయంలో జోరుగా వర్షం పడుతోంది. వరద నీటిలో మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెన కొట్టుకుపోయింది. అదే దారిలో వచ్చిన రైలు ప్రమాదానికి గురైంది. పది మంది యూరోపియన్లు, 61 మంది హిందువులు, ముస్లింలు మృతిచెందారు. ప్రమాద ప్రాంతంలోనే వారిని ఖననం చేసి ఈ స్తూపాన్ని నిర్మించారు.
ఈ ప్రమాదంలో ఆంగ్లో-ఇండియన్ థెరిస్సా లీమా సిస్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఆమె బెంగళూరులో కార్మెలైట్ సిస్టర్స్ ఆఫ్ థెరిస్సా (సీఎస్‌ఎస్‌టీ) సంస్థ అధిపతి. ఈ సంస్థ ఆధ్వర్యంలో భారత్‌లో సుమారు 115 పాఠశాలలు నడుస్తున్నాయి. ఆమె జ్ఞాపకార్థం 2003లో మంగపట్నం వద్ద ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా సెప్టెంబరు 12న స్తూపం వద్ద అంజలి ఘటించేవారు. గండికోట జలాల్లో ఈ స్తూపం మునగడంతో పాఠశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. స్తూపాన్ని సంరక్షించాలని కోరుతోంది.
ఇదీ చదవండీ... తిరుమలలో శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమం రద్దు