కడప జిల్లావ్యాప్తంగా భూ వినియోగం మార్పిడి రుసుం (నాలా) ఎగవేతకు పాల్పడిన బాధ్యులను గుర్తించి నోటీసులు జారీ చేసి రికవరీ చేయాలని తహసీల్దార్లను జిల్లా కలెక్టరు హరికిరణ్ ఆదేశించారు. ఈ నెల 3వ తేదీ రెవెన్యూ అధికారులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. దీంతో జమ్మలమడుగు, కడప, రాజంపేట ఆర్డీవోలు తమ పరిధిలోని తహసీల్దార్లకు ఈ బాధ్యతలను అప్పగించారు. మండలాల వారీగా నాలా పన్ను చెల్లించని భూ యజమానులు, కట్టడాలను నిర్మించిన వ్యాపారులు, ప్రైవేటు సంస్థలకు సంబంధించి వివరాలను వారం రోజుల్లోగా గుర్తించాలని గడువు విధించారు. దీంతో తహసీల్దార్లు తమ పరిధిలోని వీఆర్వోలను సమావేశపరిచి క్షేత్ర స్థాయిలో సర్వే, పరిశీలనకు వెళ్లి సమగ్ర సమాచారంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భూస్వచ్ఛీకరణలో నిమగ్నమైన వీఆర్వోలు చేసేదే లేక రెవెన్యూ గ్రామాల వారీగా వివరాలను సమీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లోగా 50 మండలాల వారీగా నాలా రుసుం ఎగవేతకు పాల్పడిన వారిపై నివేదిక పూర్తి స్థాయిలో అందజేయనున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
నాలాపై విజిలెన్స్ విచారణ...
2012లో జిల్లాలోని నియోజవర్గాల వారీగా ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు, రాయచోటి, మైదుకూరు, పులివెందుల, కమలాపురం, రైల్వే కోడూరుతోపాటు వేంపల్లె మండల కేంద్రంలో నాలా పన్నుల ఎగవేతపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నాలా రుసుం ఎగవేతదారులను గుర్తించి నివేదిక ఆధారంగా బాధ్యులకు ఆర్డీవోలు శ్రీముఖాలు జారీ చేశారు. తదుపరి బకాయిపన్నుల వసూలుపై ఒత్తిళ్లు, ప్రత్యేక కార్యాచరణకు అతీగతీ లేదు.
జిల్లా పరిధిలో 919.05 ఎకరాల విస్తీర్ణంలో అనధికారిక, అక్రమంగా 166 లే-అవుట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. నాలా పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డారు. వీటికి రిజిస్ట్రేషన్ నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఆచరణలో అమలు కాలేదు.
ప్రొద్దుటూరు మండల పరిధిలో 279.24 ఎకరాలకు సంబంధించి నాలా పన్నులు జమకాలేదని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది. దీనిపై ఆర్డీవోకు అప్పటి తహసీల్దారు కె.భాస్కర్‌రెడ్డి నివేదిక పంపారు. మండల పరిధిలోని చౌడూరు గ్రామ రెవెన్యూలో 30.30 ఎకరాలు, పెద్దశెట్టిపల్లెలో 47.56 ఎకరాలు, ప్రొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 182.62 ఎకరాలు, దొరసానిపల్లెలో 18.67 ఎకరాలను గుర్తించారు. నాలా పన్నులు చెల్లించకుండా కల్యాణమండపాలు, గోదాంలు, గ్యాస్ గౌడౌన్‌లు, రైస్ మిల్లులు, నివేశన ప్లాట్లు, బహుళ అంతస్తు భవనాలు, తదితర కట్టడాలకు బాధ్యులైన 163 మందిని గుర్తించారు. వీరికి 2015 డిసెంబరులో ఆర్డీవో సంజాయిషీ పత్రాలను జారీచేశారు. తదుపరి కార్యాచరణలో పురోగతి లేదు. నాలా పన్నులు జమచేసిన వివరాలపై స్పష్టత లోపిస్తోంది.
నాలా పన్ను తగ్గింపు...
2006 వ్యవసాయేతర మార్పిడి భూచట్టం ప్రకారం సబ్‌రిజిస్ట్రార్ ధర ఆధారంగా 9 శాతం నాలా పన్నులు చెల్లించాల్సి ఉంది. దీనిపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో వాజ్యం దాఖలు కాగా చివరకు దానిని 3 శాతం చెల్లించేందుకు 2018లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని పక్కాగా అమలుపరిచి నాలా పన్నులను జమ చేసుకోవడంలో రెవెన్యూ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. నాలా రుసుం చెల్లించిన తర్వాత లే-అవుట్‌లకు పంచాయతీ కార్యదర్శులు ఆమోదం ఇస్తారు. కానీ ఆచరణలో అమలు కాకపోవడం గమనార్హం.
కలెక్టరు ఆదేశాలతో కదలిక
వ్యవసాయేతర భూములకు నాలా రుసుం ఎగవేతకు పాల్పడిన వారిని గుర్తించి వసూలు చేయాలని కలెక్టరు ఆదేశించారు. దీనిపై మండలాలవారీగా తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాం. వీఆర్వోల ద్వారా నాలా రుసుం ఎంతమంది చెల్లించారో లేదో వివరాలను యుద్ధప్రాతిపాదికన సమీకరిస్తున్నాం. ఎగవేతదారులకు శ్రీముఖాలు జారీ చేసి రికవరీ చేస్తాం. గతంలో విజిలెన్స్ విచారణలో నాలా పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటాం. - నాగన్న, ఆర్డీవో, జమ్మలమడుగు