కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయ గ్రామం జింకా దళితవాడకు చెందిన.. దళితుల భూములపై పెద్దల కన్నుపడింది. 5 దశాబ్దాలుగా దళితుల సాగు చేసుకుంటున్న భూములను గుట్టుచప్పుడు కాకుండా, కొందరు రాజకీయ నేతల అండదండలు ఉన్నవారు పట్టాలు పొంది.. పొలాల్ని చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊహించని పరిణామంతో దళితులకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
ప్రభుత్వం ఇటీవల నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేయటంతో.. రాయచోటి-రాజంపేట ప్రధాన రహదారిపై ఉన్న భూములపై పెద్దలు దృష్టి సారించారు. రాజంపేట జిల్లా అయితే భూములు విలువ పెరుగుతుందని భావించిన కొందరు... జింకాదళిత వాడకు పక్కనే ఉన్న 60 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దళితులు ఆరోపించారు.
ఈ భూమిపైనే 40 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని బాధితులు వాపోయారు. ఇటీవల వచ్చిన కరువు కారణంగా భూమిని సాగు చేయలేక కూలి పనులకు వెళ్తున్నామనీ... ఇంతలోనే తమ భూమిని ఆక్రమించుకోవటానికి పెద్దలు వచ్చారని ఆరోపించారు.
కొందరు పెద్దలు తమ భూమిని చదును చేస్తున్నారని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వారికి రాజకీయ అండదండలు ఉండటంతో అధికారులు సైతం సమస్యను పరిష్కరించటం లేదన్నారు.
ఓట్లు అడగటానికి వచ్చిన నాయకులు.. సమస్యను పరిష్కరించరా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని ధ్వజమెత్తారు.
మాకు న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని రెవెన్యూ అధికారులు అడుగుతున్నారని బాధితులు ఆరోపించారు. ఈ భూములు పెద్దల హస్తగతం అయితే.. శ్మశానం కూడా మిగలదని వాపోయారు. ఇప్పటికైనా ఈ భూమి తమకు చెందేలా చూడాలని... తమకు న్యాయం చేయాలని దళితులు అర్థించారు.
ఇదీ చదవండి: 'భూముల రీసర్వే వల్ల జరిగే ప్రయోజనమేంటి ?'