CPI Narayana key comments on Viveka murder case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఈరోజు ఇంత దూరం రావడానికి ఆయన (వివేకానంద రెడ్డి) కుమార్తె సునీత పట్టుదల వల్లే సాధ్యమైందని, ఈ విషయంలో సీబీఐ చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.
సునీత పట్టుదల వల్లే ఇక్కడిదాకా వచ్చింది.. వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఈరోజు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కడప జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పట్టుదల వల్లే ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంత దూరం వచ్చింది. ఈ విషయంలో సీబీఐ చేసింది ఏమీ లేదు.
సీబీఐ సీఎం వద్ద మోకాలు వంచింది..: సీబీఐ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద మోకాలు వంచితే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా వద్ద మోకాలు వంచారని సీపీఐ నారాయణ ఎద్దేవా చేశారు. పులివెందులలో చివరికి ఏ పూల మొక్కలను అడిగినా వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో చెబుతాయని అన్నారు. వైఎస్ కుటుంబం అనుమతి లేకుండా పులివెందులలో ఒక్క చీమ కూడా కుట్టదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పట్లో అవినాష్ రెడ్డి అరెస్టు ఉండదు..!.. చివరగా అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కన్నా అవినాష్ రెడ్డి శక్తివంతుడు ఏమీ కాదని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాలలో ఎవరైనా ఎంపీ కేసులో చిక్కుకొని ఉంటే.. సీబీఐ అధికారులు వచ్చి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి, అరెస్టు చేసి తీసుకెళ్లే వారని తెలిపారు. కానీ, ఈ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని నారాయణ మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య కేసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని, ఆనాడే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ఉంటే ఇంత జరిగేది కాదని పేర్కొన్నారు. ఇప్పట్లో అవినాష్ రెడ్డి అరెస్టు ఉండదని సీపీఐ నారాయణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్తారని విమర్శించారు.
ఇవీ చదవండి