కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో.. వంద పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను.. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. అవసరమైతే నియోజకవర్గంలో మరో కొవిడ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వైరస్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే.. రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. వైరస్ సోకి ఇంటిలో వసతి సరిగ్గా లేని ప్రజలు కొవిడ్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని వసతులతో పాటు పౌష్టికాహారం అందజేస్తారని వివరించారు.
కరోనా రోగులకు 24 గంటలు వైద్యుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలిస్తారని పేర్కొన్నారు. కొవిడ్ కేర్ కేంద్రంలోనే.. 20 పడకలతో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన పడకల ఏర్పాటుకు అధికారులతో చర్చించినట్లు తెలిపారు. కరోనా బాధితుల సంఖ్య గతేడాదితో పోల్చితే గణనీయంగా పెరిగిందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేలా ప్రభుత్వం, అధికారులు తీసుకుంటున్న చర్యలకు.. ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కోరారు.
ఇదీ చదవండి:
'ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే.. రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ'