కొవిడ్ కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న క్రమంలో దానిని అరికట్టడానికి ఐదు రకాల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్‌బాష పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నగర మేయర్ సురేష్ బాబు, సబ్ కలెక్టర్ పృధ్వితేజ్, మున్సిపల్ కమిషనర్ లవన్న, డీఎస్పీ సునీల్ లతో కలిసి కొవిడ్ టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
కడపలోని ఆయా సచివాలయ పరిధిలో ఉన్న 45 ఏళ్ళు, 60 ఏళ్ళు పైబడిన ప్రతిఒక్కరిని వాలంటీర్లు, సెక్రటరీల ద్వారా గుర్తించి వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించేలా ప్రతిరోజు టార్గెట్ ఫిక్స్ చేయాలని ఆదేశించారు. అలాగే 45 ఏళ్లు దాటినా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కొవిడ్ టీకా తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు.
కడప నగర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ఐదు రోజుల చొప్పున హోర్డింగ్ ఆటోలతో కొవిడ్ నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు,కొవిడ్ వ్యాక్సినేషన్ పట్ల అపోహలు తొలగించేలా ప్రజల్లో అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని సూచించారు.
సచివాలయ సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేసి కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని, అప్పటికీ జాగ్రత్తలు పాటించని వారిపై తగిన జరిమానా విధించి, కఠినంగా వ్యవహరించాలన్నారు. సచివాలయ పరిధిలోని సెక్రటరీలు కూడా కొవిడ్ నిబంధనలు పాటించని వారి ఫోటోలు తీసి పోలీస్ శాఖ వారికి తగిన చర్యలు కోసం పంపవచ్చునన్నారు.
ఇదీ చదవండి: 'కేసు సీబీఐ చేతిలో ఉందని తెలిసీ జగన్ బాబును విమర్శిస్తున్నారు'