కరోనా మనస్థాపంతో కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్య - కడపలో కరోనా
కరోనా మనస్థాపంతో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెలో రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగిరెడ్డి గంగిరెడ్డి(55) కరోనా సోకిందన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. ఆదివారం ప్రొద్దుటూరులోని మదన్ ఆస్పత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం గంగిరెడ్డి ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా, సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించారు. కిందకు వెళ్లి వస్తానని చెప్పిన గంగిరెడ్డి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెలో రైల్వేట్రాక్‌పై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఘటనాస్థలిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి పరిశీలించారు. గంగిరెడ్డి చిలంకూర్‌లో నివాసం ఉంటున్నారు. కార్మిక నాయకుడిగా పని చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు.