కాలజ్ఞానకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఇటీవల పీఠాధిపత్యం సమస్య తలెత్తింది. బ్రహ్మంగారి వారసులైన 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మే 8న కాలం చేయగా... అనంతరం ఆయన ఇద్దరు భార్యల కుమారుల మధ్య పీఠాధిపత్యం కోసం పోటీ నెలకొంది. ఇరు కుటుంబాలవారు పీఠాధిపత్యం తమకే కావాలని పట్టుబడుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకత్వంలో సమస్య పరిష్కారానికి ఈనెల 2న విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి ఆధ్వర్యంలో 12 మంది మఠాధిపతులు.. బ్రహ్మంగారిమఠం వెళ్లారు. రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. ఈ నెల 10 వరకు సమయం కావాలని ఇరు కుటుంబాలూ కోరడంతో పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మఠానికి తక్షణం కార్యనిర్వహణ అధికారిని నియమించాలని సూచించారు.
మరోసారి పయనం..
రెండు కుటుంబాలు కోరిన పది రోజుల గడువు ముగిసినందున శివస్వామి సారథ్యాన 20 మంది మఠాధిపతులు, స్వామీజీలు మరోసారి బ్రహ్మంగారిమఠం వెళుతున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండి, ఇరు కుటుంబాలతో చర్చించనున్నారు. ఈసారి సమస్యను కచ్చితంగా కొలిక్కి తెస్తామని శివస్వామి చెబుతున్నారు.
వెంకటాద్రిస్వామి వైపు మొగ్గు..
దివంగత వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్య చంద్రావతమ్మ పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామికి వేదాలు తెలిసినందున పీఠాధిపత్యానికి ఆయన అర్హులని స్వామీజీలు భావిస్తున్నారు. రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ ఇద్దరు కుమారులూ మైనర్లు కావడంతో వారికి అర్హత ఉండదని అంటున్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించిన 'నోబెల్' గ్రహీత కైలాశ్ సత్యార్థి