ప్రకృతి, సంప్రదాయ వ్యవసాయ సాగు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కడప జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉందని కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న "ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం" (ఏపీ సీఎన్ఎఫ్) కార్యక్రమం జిల్లాలో అమలు తీరు, విస్తరణపై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేరకు.. ఆయా గ్రామాల రైతు భరోసా కేంద్రాల పరిధిలోని వివిధ వ్యవసాయ శాఖల అధికారులు పూర్తి బాధ్యతలు నిర్వహించాలన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంపొందించి, ఔత్సాహిక రైతులకు అవసరమైన వనరులు, మౌలిక సదుపాయలను సమకూర్చాలన సంబంధిత అధికారులను ఆదేశించారు. సంప్రదాయ వ్యవసాయ సాగు పద్ధతులను అమలు చేయాలని.. వచ్చే జూన్ 15న నాటికి అన్ని యూనిట్ల మంజూరు పూర్తి చేసి.. జిల్లా లక్ష్యాన్ని సాధించాలన్నారు.
ప్రతి నెల 24న సామాజిక సంప్రదాయ సాగుపై ఏపీసీఎన్ఎఫ్ కమిటీ సమావేశం నిర్వహించడం, అందులో లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షిస్తామన్నారు. ప్రతి అనుబంధ శాఖకు లక్ష్యాలను నిర్దేశించాలని కలెక్టర్ సూచించారు.
ఇదీ చూడండి.. ఆనందయ్య ఔషధంపై ఐదారు రోజుల్లో తుది నివేదిక: ఆయుష్ కమిషనర్