కడప జిల్లా పరిధిలోని పెన్నా, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు, బాహుదా నదీ పరివాహక పరిసరాల్లో వేర్వేరుగా 12 చోట్ల ఇసుక క్వారీలకు కలెక్టరు హరికిరణ్ ఆమోదం తెలిపారు. ఇటీవల జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతి రాగానే రీచ్‌లను వినియోగంలోకి తీసుకురానున్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో డంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రవాణా కోసం కార్యాచరణ చేపడతారు. గృహ, భవన నిర్మాణ రంగాల్లోని కట్టడాలకు ఇసుక కొరత రానీయకుండా గనుల శాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలో 12 చోట్ల క్వారీలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
త్వరలోనే అనుమతులు
కాలుష్య, పర్యావరణ అధికారుల నుంచి అనుమతి కోసం నిరీక్షణ చేస్తున్నాం. ఆమోదం రాగానే మైనింగ్‌శాఖ ఆధ్వర్యంలో రీచ్‌ల నుంచి ఇసుక రవాణా చేస్తాం. ఆయా క్వారీలకు సమీపంలో అనువైన చోట్ల డంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుక తరలిస్తాం. - సుబ్బరాయుడు, జిల్లా ఇసుక అధికారి
వివరాలు
● పెన్నా పరివాహకంలో... కన్నెలూరు-2 (జమ్మలమడుగు), జంగాలపల్లె-3, జ్యోతి రీచ్-3, ఎస్.రాజంపేట (సిద్ధవటం), వెదురూరు-2 (చాపాడు)
● చిత్రవతి : పొట్టిపాడు-బెడదూరు: 2, వెంకయ్య కాల్వ (కొండాపురం)
● పాపాఘ్ని : యర్రబల్లి (కమలాపురం), కొండూరు (పెండ్లిమర్రి)
● బాహుదా : రాయవరం-3 (టి.సుండుపల్లి)
● చెయ్యేరు : కుమారునిపల్లె- 2, 3 (నందలూరు)
ఇదీ చదవండీ.. ఆగని రెమ్‌డెసివిర్ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు