పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ.. పాడాపై సమీక్షించిన సీఎం... ఇప్పటి వరకూ జరిగిన ప్రగతిపై చర్చించారు. పులివెందుల వైద్య కళాశాలకు ఆగస్టు నాటికి టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి... ఈ ఏడాది పూర్తైయ్యేలోగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి యర్రబల్లి సహా కొత్తగా నిర్మించనున్న గిడ్డంగివారి పల్లె చెరువు, యూసీఐఎల్ ప్రభావిత 7 గ్రామాలకు నీరు అందించే పనులకు పరిపాలనాపరమైన అనుమతులు త్వరగా ఇవ్వాలని ఆదేశించారు.
పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు, పెండింగ్ పనులపై సీఎం చర్చించారు. అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ కేంద్రాలను సిద్ధం చేయాలన్న జగన్... అరటి, టమాటా, బత్తాయి పంటల దిగుబడి సమయంలో సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.
పులివెందుల వైద్య కళాశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం... ఏడాదిలోగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రాయలసీమలోని ఆసుపత్రుల అభివృద్ధి కోసం టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ఏపీ కార్ల్కు అనుబంధంగా అగ్రికల్చర్, హర్టికల్చర్, వెటర్నరీ కాలేజీలతో పాటు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాల ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. పులివెందులలో 255 ఎకరాల్లో అతిపెద్ద లేఅవుట్ చేసినట్లు తెలిపిన అధికారులు... దాదాపు 15 వేల మందికిపైగా లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు సిద్ధంచేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఒకే ఒక్క పోస్ట్.. ఆమెను సీఐడీ ముందుకు తీసుకెళ్లింది..!