కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచారణ సాగింది. ఉదయం విచారణకు హాజరైన శివశంకర్ రెడ్డితో ఇద్దరు సీబీఐ అధికారులు... మూడు రౌండ్లు కారిడార్లో నడుచుకుంటూ మాట్లాడారు. విచారణకు మానసికంగా సిద్ధం చేయడానికి ఇలా చేసి ఉంటారని తెలుస్తోంది. 8 గంటల పాటు శంకర్ రెడ్డిని విచారించిన సీబీఐ బృందం పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ప్రశ్నల వర్షం
మంగళవారం వివేకా కుమార్తె సునీత ఇచ్చిన సమాచారం ఆధారంగా శివశంకర్ రెడ్డిని లోతుగా విచారించారు సీబీఐ అధికారులు. వివేకా హత్య జరిగిన రోజు వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు శివశంకర్ రెడ్డి కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. రక్తపు మరకలు తుడుస్తుంటే పరోక్షంగా సహకరించినట్లు అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా గతేడాది మార్చి 14వ తేదీ సాయంత్రం ఎర్ర గంగిరెడ్డికి శివశంకర్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే నెల 15వ తేదీ తెల్లవారుజామున ఉదయ్ కుమార్ రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కలుసుకున్నట్లు సునీత హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ముగ్గురు తెల్లవారుజామున ఎందుకు కలుసుకున్నారనే విషయంపై సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం.
2016లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమి చెందడానికి ప్రధాన కారణం శివశంకర్ రెడ్డి అని సునీత సీబీఐ అధికారులకు వివరించారు. ప్రత్యర్థులతో చేతులు కలిపి తన తండ్రి ఓటమికి కారణం అయ్యారని ఆమె ఆరోపించారు. ఈ వివరాలన్నింటిపైనా సీబీఐ అధికారులు... శివశంకర్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు ఓ పత్రికా విలేఖరికి ఆయన ఫోన్ చేసి చెప్పినట్లు సునీత ఆరోపిస్తున్నారు. వీటన్నిటిపై ముందే ప్రశ్నావళి సిద్ధం చేసుకున్న సీబీఐ అధికారులు వివేకా హత్యపై పలు ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టినట్లు సమాచారం.
మరోసారి విచారణకు..
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సీబీఐ... అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. గురువారం కూడా పులివెందులకు చెందిన కొందరు కీలక అనుమానితులను విచారణకు హాజరుకావాలని సీబీఐ తెలిపినట్లు సమాచారం.
ఇదీ చదవండి