2001 సెప్టెంబరులో వచ్చిన భారీ వరదలతో కడప బుగ్గవంక పోటెత్తి.. సగం వరకు కడప నగరం మునిగిపోయింది. పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడగా... కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో బుగ్గవంక సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించి.. 35 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆక్రమణలు తొలగించకుండా బుగ్గవంక సుందరీకరణ చేపట్టడం సాధ్యం కాదనే ఉద్దేశంతో.. రెండు గుత్తేదారు సంస్థలు చేతులెత్తేశాయి.
ప్రస్తుతం బుగ్గవంకకు రెండు వైపుల 40 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించేందుకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులు చేయాలంటే బుగ్గవంకకు రెండు వైపుల ఉన్న 119 అక్రమ కట్టడాలను తొలగించాలి. ఇందులో 39 వరకు నివాసాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ స్థలంలో నిర్మించినవేనని అధికారులు చెబుతున్నారు. నెలరోజుల గడువు ఇచ్చిన తర్వాత.. మూడు రోజుల నుంచి కూల్చివేత పనులు చేస్తుండగా.. సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గుర్రాలగడ్డ వద్ద ఇళ్లు కూల్చే సమయంలో నీటిపారుదలశాఖ అధికారిపై నిర్వాసితులు దాడి చేశారు.
బుగ్గవంక సుందరీకరణ పనులు పూర్తికాక పోవడానికి ప్రధాన కారణం.. సీఎం జగన్ బంధువు రవీంద్రనాథ్ రెడ్డి థియేటరే కారణం అని విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. బుగ్గవంకను ఆనుకుని థియేటర్ ఉన్న కారణంగా ఎవరూ వాటిని కూల్చడానికి సాహసించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పేదలకు ఇళ్లు చూపించకుండా ఉన్న ఫలంగా ఇళ్లు కూల్చివేస్తే... వారు ఎక్కడికి పోతారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి.
ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇవ్వడం కుదరదని అధికారులు అంటున్నారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారనే కారణంతో పునరావాసం కల్పిస్తామని చెబుతున్నారు.
ఇదీ చదవండి: