ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చకొట్టేందుకే కడప ఉక్కుకు బదులు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనసాగించమని వైకాపా ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. ఈ కుట్ర వెనుక ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన జగన్..,స్థానిక ప్రజల ఆకాంక్ష అయిన కడప స్టీల్ ప్లాంట్‌ను ఆదిలోనే అంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు.
జగన్ చేతకానితనం వల్లే ఏపీ పరిశ్రమలను కేంద్రం ప్రైవేటీకరణకు యత్నిస్తోందన్నారు. దివాళ తీసిన సంస్థతో ఒప్పందం చేసుకున్నపుడే కడప స్టీల్ ప్లాంట్‌పై జగన్ కుట్ర ప్రజలకు అర్థమైందని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ఎంపీల వ్యాఖ్యలతో నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు, కడప ఉక్కు రెండు కొనసాగించాలని కేంద్రానికి జగన్ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కడప ఉక్కు ఉద్యమం కూడా మొదలవుతుందని హెచ్చరించారు.
ఇదీచదవండి